News » View Details

  •  

విశాఖ కేంద్రంగా హవాలా రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం..

Posted on 13th May, 2017 | Views : 626
 విశాఖ కేంద్రంగా హవాలా  రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం..
facebook twitter google plus linkedin pinterest mail

 

 విశాఖ కేంద్రంగా హవాలా..రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం..స్థానిక బ్యాంకులో 30 ఖాతాలు ప్రారంభం..వీటిల్లోకి రూ.680.94 కోట్లు జమ 
రూ.569.93 కోట్లు సింగపూర్‌, చైనా, హాంకాంగ్‌ దేశాలకు తరలింపు..కోల్‌కతా, వైజాగ్‌లలో డొల్ల కంపెనీలు..నిందితుడు 24 ఏళ్ల యువకుడు 
బ్యాంకు అధికారులతో కుమ్మక్కు ..ఓ బడా రాజకీయ నాయకుడి హస్తంపై అనుమానం...
విశాఖలోని ఓ బ్యాంకు కేంద్రంగా ఓ యువకుడు రూ.1,500 కోట్ల భారీ హవాలా వ్యాపారం చేశాడు. తన పనిని చాలా వరకు పూర్తి చేశాడు. విషయం తెలుసుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగి విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 9వ తేదీ నుంచి పెద్దఎత్తున తనిఖీలను నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడని గుర్తించారు.అక్రమంగా డబ్బు పంపడంలో దిట్ట... 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టోన్‌ క్రషర్‌ యజమాని వడ్డి శ్రీనివాసరావు కుమారుడు మహేష్‌ (24). హవాలా లావాదేవీలు నడిపించడంలో ఆరితేరాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాంకు ఖాతాల ద్వారానే డబ్బును నేరుగా విదేశాలకు పంపించేయడంలో దిట్టగా మారాడు. వ్యాపారులకు అతనిపై బాగా నమ్మకం కుదిరింది. భారీ మొత్తాల్ని పంపడానికి అతన్నే ఆశ్రయించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి నిర్ణీత రుసుములను చెల్లించకుండా కోట్లాది రూపాయల్ని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు పంపేసి నల్ల కుబేరుల ధనాన్ని తెలుపు చేసి పెడుతూ ప్రతిఫలంగా భారీఎత్తున కమీషన్లను దండుకుంటున్నాడు.
ఒకే ఒక్క బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.570 కోట్ల జమ అతడి హవాలా వ్యాపారానికి పలువురు బ్యాంకు అధికారులు కూడా సహకరించారు. గతేడాది కేంద్రం నోట్ల రద్దు చేయడం కూడా అతనికి కలిసొచ్చిందో? ఏమో? అతని అక్రమ వ్యాపారం పతాకస్థాయికి చేరింది. విషయం ఆ నోటా... ఈ నోటా... ఐటీ అధికారులకు చేరింది. అతడు లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులపై నిఘా పెట్టగా కోల్‌కతాలోని డొల్ల కంపెనీల నుంచి విశాఖలోని ఖాతాలకు నగదు చేరుతోందని గుర్తించారు. విశాఖలోని ఒకే ఒక్క బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.570 కోట్ల నగదు వివిధ ఖాతాల నుంచి జమ అయినట్లు తేలింది. అదే ఖాతాకు మరో రూ.90 కోట్లు ఒకేసారి జమయింది. మహేష్‌ మొత్తం రూ.1,500 కోట్ల వరకు హవాలా నడిపించినట్లు ప్రాథమికంగా తేల్చారు.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు సమాచారం
ఆయా లావాదేవీల సరళి చూసి నివ్వెరపోయిన ఐటీ అధికారులు కుంభకోణం మూలాలు చాలా లోతుగా ఉన్నాయని గుర్తించి బృందాలతో రంగంలోకి దిగారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కోల్‌కతాలోని డొల్ల కంపెనీలపై దాడులు చేసి పలువుర్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. విశాఖ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో కూడా దాడులు చేసి అన్నింటికీ మూలకారణం వడ్డి మహేశ్‌ అని తేల్చారు. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా నుంచి డొల్ల కంపెనీల ద్వారా విశాఖలోని బ్యాంకులకు వచ్చిన నిధులు తిరిగి సింగపూర్‌, బ్యాంకాక్‌, మలేషియా, హాంకాంగ్‌, చైనా తదితర ప్రాంతాలకు కూడా తరలించినట్లు తేల్చారు. విదేశాలతో ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్లు తేలడంతో ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌’ అధికారులకు విశాఖ ఐ.టి. అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వారు కూడా రంగంలోకి దిగి విశాఖ నుంచి ఏయే దేశాల్లోని ఏయే బ్యాంకుల శాఖలకు నిధులు హవాలా మార్గాల్లో వెళ్లాయి... ఆ ఖాతాదారులు ఎవరన్నది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. మనీలాండరింగ్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి మరింత లోతైన దర్యాప్తు చేయనున్నారు.నిందితుడిని పోలీసులకు అప్పగింత.. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై చేసిన మోసం కావడంతో నగర పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు. ప్రధాన నిందితుడు మహేశ్‌ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా దీనిపై కూపీ లాగగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కొందరిని చూపించారని నిర్ధారించారు. విశాఖ పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేయగా... వడ్డి మహేశ్‌ తమ బంధువేనని... తాము లారీ క్లీనర్లుగా జీవిస్తూ పొట్టపోసుకుంటున్నామని చెప్పారు. చాలా కాలం కిందట తమతో పేపర్ల మీద సంతకం చేయించుకున్నాడని... ఎందుకు చేయించుకున్నాడన్న వివరాలు మాత్రం తమకు తెలియవని చెప్పారు. వడ్డి మహేశ్‌కు బెంజికారు ఉందని అత్యంత విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
వడ్డి మహేశ్‌పై కేసు నమోదు చేశాం.వడ్డి మహేశ్‌ హవాలా లావాదేవీలకు, మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసి ఐ.టి. అధికారి ఎం.వి.ఎన్‌.శేషుభావనారాయణ ఫిర్యాదు చేయడంతో ఎంవీపీ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశాం. మహేశ్‌ 2014 నుంచి హవాలా వ్యాపారం చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. అతడితో పాటు తండ్రి శ్రీనివాసరావు, ఆచంట హరీష్‌, ఆచంట రాజేశ్‌, ప్రశాంత్‌కుమార్‌ రాయ్‌ బర్మన్‌, ప్రవీణ్‌కుమార్‌ ఝా, ఆయుష్‌గోయల్‌, వినీత్‌గోయంకా, వికార్‌గుప్తా తదితరులు కుమ్మక్కయ్యారు. విశాఖ కేంద్రంగా 12 డొల్ల కంపెనీల్ని స్థాపించి 30 బ్యాంకు ఖాతాల్ని తెరిచారు. వీటిల్లోకి రూ.680.94 కోట్లు జమకాగా రూ.569.93 కోట్లు సింగపూర్‌, చైనా, హాంకాంగ్‌ దేశాలకు తరలిపోయింది. ఆయా వ్యవహారాలు నిర్వహించడానికి వీరు ఫోర్జరీలు చేయడం, దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం తదితరాలెన్నో చేశారు. విశాఖతోపాటు విదేశాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.1,500 కోట్ల హవాలా లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. వ్యవహారం మొత్తం మహేశే నడిపించాడా? అతని వెనక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా? అన్న విషయాల్ని సైతం ఆరా తీస్తున్నాం. ఎవరైనా రాజకీయ నాయకుడో? బడా పారిశ్రామికవేత్త హస్తమో? ఉండొచ్చన్న అనుమానాల్ని కొట్టి పారేయలేం.

 

Also View

  •